ఇచ్చోడ: అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ప్రతి రైతుకు ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా, రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మండలానికి ఒక గ్రామానికే ఇస్తున్నారని, తామేం పాపం చేసామంటూ పంట పొలాల్లో నిలబడి నిరసన తెలుపుతున్నామన్నారు.
చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహాలక్షి పథకంలో ప్రతి మహిళకు ప్రతి నెలకు వెయ్యాలన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తలేడని విమర్శించారు. వానాకాలం రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు, రభీ పంట కూడా వేశామని ఇంకా రైతు భరోసా రాలేదని చెప్పారు. అప్పులు చేసి పంట వేశామని, కనీసం ఇప్పుడైనా అందరికి పెట్టుబడి సాయం ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీని నేరవెర్చాలని వ్యవసాయ క్షేత్రంలో దుఃఖంతో రైతులు నిలబడి సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీకి వీడియోలు పంపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, ప్రలాద్, దత్త, నాగనాథ్, తిరుపతి, తులసిరామ్, రైతులు పాల్గొన్నారు.