ఆదిలాబాద్ : సమిష్టి కృషితో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు ముఖరా(కె) (Mukhara (K) )గ్రామస్తులు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగానే ఉంటుంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ సంవత్సర కాల పాలనలో(Congress rule) ప్రజలు విసుగు చెందారని ఆరోపిస్తూ ‘వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా రేవంత్ రెడ్డి పాలన’ అంటూ గ్రామంలో ప్లెక్సీ(Flexi banners )పెట్టి నిరసన వ్యక్తం చేశారు.
26 జనవరి నుంచి ప్రతి గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామమే ఎంపిక చేయడం చాలా అన్యాయమని విమర్శించారు. తాము అధికారంలో వచ్చాక 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 13 నెలలు అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అని రైతు భరోసా బాకీ, తులం బంగారం బాకీ, రైతు రుణమాఫీ బాకీ, మహాలక్ష్మి బాకీ, పింఛన్ బాకీ, 2లక్షల ఉద్యోగాలు బాకీ, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలానికి ఒక గ్రామానికే పథకాలు ఇస్తామంటే మిగిలిన గ్రామాలు మీకు ఓటు వెయ్యలేదా అని ప్రశ్నించారు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? లేక మండలానికి ఒక గ్రామానికే ముఖ్యమంత్రివా అంటూ నిలదీశారు. వెంటనే అందరికి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతి గ్రామంలో ఇలాగే ఆరు గ్యారాంటిలపై నిలదీస్తామని హెచ్చరించారు. కాగా, ఇప్పుడీ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ కార్యక్రమంలో గాడ్గే మీనాక్షి, గాడ్గే సుభాష్, రైతులు తిరుపతి, విఠల్, దత్త, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.