ఊర్కొండ, జనవరి 25 : వ్యవసాయ క్షేత్రంలో తీసిన నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాదోల శ్రీకాంత్‌రెడ్డి- రజిని దంపతుల కూతురు సిరి(14), కుమారుడు శ్రీమాన్యు (14), శ్రీకాంత్‌రెడ్డి సోదరి కూతురు స్నేహ(15), శ్రీకాంత్‌రెడ్డి అన్న కూతురు నలుగురు పొలం వద్ద ఆడుకుంటూ ఉన్నారు.
కొంచెం దూరంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు శ్రీకాంత్‌రెడ్డి కొడుకు శ్రీమాన్యు వ్యవసాయ క్షేత్రంలోని నీటి గుంతలో పడిపోయాడు. తమ్ముడిని కాపాడానికి మిగతా ముగ్గురు ప్రయత్నించి వారు కూడా గుంతలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగిపోగా శ్రీకాంత్‌రెడ్డి అన్న కూతురు మాత్రం పక్కన ఉన్న చెట్టును పట్టుకున్నది.
గమనించిన తల్లిదండ్రులు గుంత వద్దకు వచ్చి రోదించగా చుట్టుపక్కల వారు వచ్చిగుంతలో దూకి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను 108లో కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చిన్నారుల మృతితో ముచ్చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకొన్నాయి.