CM KCR | తెలంగాణ రైతాంగం సంక్షేమం కోసం తాను రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్ స్వామినాథనే ప్రశంసించారని, శభాష్ చంద్రశేఖర్ బాగా చేశారంటూ కితాబిచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూఎన్ఓ కూడా భేష్ అయిన పథకం.. ప్రపంచంలో ఎక్కడా లేదు.. తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబిచ్చింది. భక్తరామదాసు వచ్చాక.. పెట్టుబడికి రైతుబంధు వచ్చాక.. రైతుబీమాతో రైతుకు ధీమా వచ్చాక, 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఇవాళ ఏమైంది.. పరిస్థితి తారుమారైంది. బ్యాంకు లోన్లు తేరిపోతున్నయ్. లోన్లు అవసరం తీసుకునే అవసరం లేకుండా ఉంది. మనుపటి రోజుల్లో రెండు ఎరువు బస్తాలు కావాలంటే.. వారికే ధాన్యం పోయడం.. అడిగిన ధరకే ఇవ్వడం ఉండేది’ అని గుర్తు చేశారు.
‘వ్యవస్థాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టాను. నేను కూడా రైతుబిడ్డనే.. కాపోడినే కాబట్టి.. వ్యవసాయం బాధ తెలుసుకాబట్టి రైతుబంధు అమలు చేశాం. రైతుబంధు ఎకరానికి రూ.4వేలే ఇచ్చాం. ఆ తర్వాత రూ.5వేలు ఇచ్చుకున్నాం. జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్. ఆ తర్వాత నెంబర్-2 స్థానంలో నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని సగర్వంగా మనవి చేస్తున్నా. ధాన్యం అమ్మకాలను పట్టించుకున్నోడు లేడు. ఎరువుల బస్తాలు దొరికేవి కావు. చెప్పులను లైన్లు పెట్టేది. పోలీస్స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మేది కాంగ్రెస్ రాజ్యం.
ఇవాళ కావాల్సినంత ఎరువుల బస్తాలు. కల్తీ లేని విత్తనాలు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లలో పెడుతున్నాం. పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాం. పెట్టుబడి సాయం చేతిలో ఉంది. 24గంటల కరెంటు ఉంది. బ్రహ్మాండమైన పంటలు పండి మూడుకోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండిస్తున్నది. రాబోయే రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతున్నది. ఒకసారి వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ, నీళ్ల పీడ తొలగిపోతుంది. పాలేరులో తొంగి చూడదు. బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది తప్పా.. వెనక్కి వెళ్లదు’ అన్నారు.