కీసర, ఆగస్టు 24 : ఓ వైపు ఉన్నత చదువు చదివి డాలర్లు సంపాదించాలన్నది లక్ష్యం. మరోవైపు ప్రేమించిన యువతిని పెండ్లి చేసుకోవాలని కోరిక. ఈ రెండు నెరవేరక తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ శ్రీనివాస్‌నగర్ కాలనీలో నివాసముంటున్న సాయిప్రదీప్ 2024లో మాస్టర్స్ (ఎంఎస్) కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌లోని తన సోదరుడితో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
అమెరికాలో ఉంటున్న సాయిప్రదీప్కు సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య ప్రేమాయణం కూడా కొనసాగింది. ఉద్యోగం కోసం సాయిప్రదీప్ నాలుగు నెలలుగా విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇదే సమయంలో ప్రేమించిన యువతి దూరం పెట్టింది. ఇటు ఉద్యోగం రాక, అటు ప్రేమించిన యువతి దూరం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు అత్మహత్య చేసుకున్నాడు.