హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజా పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు నిరుద్యోగుల ఆందోళనలకు రేవంత్ సర్కారు దిగివచ్చింది. 60 రోజుల్లో సమగ్ర కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలవారీగా ఆర్థిక, విద్య, ఉద్యోగ రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
మిన్నంటిన ఎమ్మార్పీఎస్ ఆందోళనలు
ఎస్సీల్లో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షం ప్రకటించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాద తీర్మానం సైతం ప్రవేశపెట్టారు. దాంతో ఎస్సీ ఉపవర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మాదిగలు ఆశించారు. నెలలు గడుస్తున్నా అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఖంగుతిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు ఆందోళనలు చేపట్టారు. మాదిగ పోరాట నాయకులు మంద కృష్ణ, వంగపల్లి శ్రీనివాస్ వేర్వేరుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో వర్గీకరణ అమలుకు క్యాబినెట్లో సైతం చర్చించారు. ఉత్తమ్ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం వర్గీకరణ చేపట్టాల్సిందేనని ప్రభుత్వానికి విన్నవించారు. ఎక్కడికక్కడ తమను ప్రజలు వర్గీరణ అంశంపై నిలదీస్తున్నారని సీఎంకు తెలిపారు.
రోడ్డెక్కిన ఆదివాసీలు, గిరిజనులు
జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని ఆదివాసీలు, గిరిజనులు చాలా నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) ప్రకారం.. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎంతశాతం ఉంటారో జనాభాలో అంతశాతం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం ఇంకా పెరుగుతుందని ఎస్టీలు డిమాండ్ చేస్తున్నారు. లంబాడీలు, గోండుల మధ్య తలెత్తిన రిజర్వేషన్ల కొట్లాటను కూడా సర్కారు పరిష్కరించాల్సి ఉన్నది.
ప్రభుత్వానికి బీసీల అల్టిమేటం
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తమకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కడం లేదని బీసీలు ఆందోళన చేపట్టారు. బీసీల రిజర్వేషన్‌ను తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. తక్షణమే బీసీ గణన చేపట్టాలని అల్టిమేటం జారీచేశారు. సుప్రీంకోర్టు సైతం ఇందు కు అనుగుణంగా తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, జాజాల శ్రీనివాస్ ఇతర నేతలు కూడా రిజర్వేషన్లలో బీసీల వాటా తేల్చాలని డిమాండ్‌చేశారు. పెద్దఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. బీసీల ఒత్తిడితో నిరంజన్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ వేసి చేతులు దులుపుకున్నది. దీనిపైనా బీసీలు నిరసనగళం పెంచుతూనే ఉన్నారు. మరోవైపు ముస్లింలు సైతం తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ రిజర్వేషన్లకు కోతపెట్టి ఇతరవర్గాలకు కేటాయిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు నిరుద్యోగులు కూడా ఆందోళన బాటపట్టారు. రిజర్వేషన్ల సంగతి తేల్చిన తర్వాతే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఒత్తిడి పెంచడంతో చివరికి రేవంత్‌రెడ్డి సర్కారు సమగ్ర సర్వేకు తలవంచక తప్పలేదు.
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయండి
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారీగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సర్వే సమగ్రంగా చేపట్టాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరి 4న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. బడుగు, బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. సర్వే నిర్వహణకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించారు. ఈ సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్
ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2023లో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ షమీమ్ అక్తర్ రిటైర్ అయ్యారు. ఈ కమిషన్ ఎస్సీ క్యాటగిరీల్లో సబ్-క్యాటగిరీ జాతులపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.