చిక్కడపల్లి, జూలై 7: కేంద్రం మోసం వల్లే వర్గీకరణలో జాప్యం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి పదేండ్లు దాటినా ఇంతవరకు నెరవేర్చలేదని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ధ్వజమెత్తారు. ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ వర్గీకరణ సాధనకోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజాగాయని విమలక్క దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాటం పారంభమై 30 సంవత్సరాలవుతున్నా పరిష్కారం కాలేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు సమావేశమైనా వర్గీకరణ విషయం ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీవర్గీరణ డిమాండ్‌కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, మాదిగ జర్నలిస్టుల సంఘం నేత నరేందర్ తదితరులు పాల్గొన్నారు.