ముషీరాబాద్, జూన్ 30: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా కేంద్రప్రభుత్వం మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
ఆదివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌లు వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని వర్గాల మద్దతు, పలు కమిటీల నివేదికలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గత మూడు దశాబ్దాలుగా మాదిగలు మోసపోతూనే ఉన్నారని తెలిపారు. ఇటీవల ఎన్నికల సభలో తాను మాదిగల పెద్దన్ననని చెప్పిన ప్రధాని మోడీ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పొట్టపెంజర రమేశ్, చిలకమర్రి గణేశ్, హుస్సేన్, చిన్నస్వామి, సారంగం, శ్రీనివాస్, యాదగిరి, మేడి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.