మలక్‌పేట, జనవరి 4: అధికారంలోకి వచ్చేందుకు దివ్యాంగులకు అనేక హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారం చేపట్టాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వీహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. అంధుల అక్షర ప్రదాత లూ యీస్ బ్రెయిలీ జయంతి వేడుకలకు దివ్యాంగుల శాఖ మంత్రి సీతక్క హాజరుకాకపోవడం బాధాకరమని తెలిపారు. లూయీస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ మలక్‌పేట నల్లగొండ చౌరస్తాలోని వికలాంగుల జాతీయ ఉద్యాయవనంలో లూయీస్ విగ్రహానికి మందకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు, చేయూత పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలు పరుచలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై దివ్యాంగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు. 45 లక్షలకు పైబడి ఉన్న చేయూత పెన్షన్‌దారులు రేవంత్‌రెడ్డికి త్వరలోనే కర్రుకాల్చి వాత పెట్టనున్నారు. ఏపీలో చంద్రబాబు దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు. మరి రేవంత్‌రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదు’ అని నిలదీశారు.