ఖైరతాబాద్, డిసెంబర్ 12 : కవులు, కళాకారులకు ఫోర్త్‌సిటీలో 300 గజాల స్థలంతోపాటు రూ.కోటి నజరానా ఇస్తామన్న ప్రకటనలో మాదిగలను ఎందుకు గుర్తించలేదని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మాదిగల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మాజీఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజు లాంటి కళాకారులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. అరుణోదయ విమలక్క లాంటి ఎందరో కళాకారులను ఎందుకు గుర్తించలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయానికి వస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఓ సమావేశంలో అన్నట్టు.. తెలంగాణ తల్లి విగ్రహ రూపం తన తల్లిని చూసినట్టే ఉందని పేర్కొన్నారని, దీనిని బట్టి ఆయన తల్లి రూపాన్నే పెట్టినట్టు అనిపిస్తుందని పేర్కొన్నారు. బహుజనుల రాజ్యంలో తెలంగాణ తల్లులుగా చాకలి ఐలమ్మ, తొలి తెలంగాణ ఉద్యమకారిణి సదాలక్ష్మి విగ్రహాలను పెట్టి స్మరిస్తామని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి ప దవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బహుజన కళాకారుల అస్థిత్వాన్ని చాటుతూ జనవరి 27న ‘వె య్యి గొంతులు-లక్ష డప్పులు’ కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో కళాకారులు, ఎమ్మా ర్పీఎస్ లీడర్లు ఏపూరి సోమన్న, నరేశ్‌మాదిగ, అశోక్‌మాదిగ, శరత్, రాంనర్సయ్య, అనిల్, అశోక్, రమేశ్, రామస్వామి, స్వామి, శివకుమార్ పాల్గొన్నారు.