ఖైరతాబాద్, ఫిబ్రవరి 17: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉన్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీరశైవ కక్కయ్య డోర్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ‘వర్గీకరణ నివేదికను ప్రకటించే ముందు ప్రభుత్వం తగిన కసరత్తు చేయలేదు. ఆ నివేదికను సబ్కమిటీగానీ, క్యాబినెట్గానీ అధ్యయనం చేయలేదు. ఆగమేఘాల మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని వెనుక ఓ మతలబు ఉన్నది. ఈ నెల 7న లక్ష డప్పులు, వేలగొంతుల కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం.
దీన్ని రద్దు చేయించడానికే ప్రభుత్వం హడావుడిగా ఎస్సీ వర్గీకరణను ప్రకటించింది’ అని తెలిపారు. ఎస్సీలోని అన్ని కులా లు, వాటి ఆర్థిక పరిస్థితులను సరిగా అధ్యయనం చేయకుండా, అంచనా వేయకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందని చెప్పా రు. గ్రూప్-3లో ఉండాల్సిన వారిని గ్రూ ప్-1, 2లో గ్రూప్-1, 2లో ఉండాల్సిన వారిని గ్రూప్-3లో వేశారని వెల్లడించా రు. తప్పును సరిచేసుకునే అవకాశమున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ సూచించారు. సమావేశంలో శ్రీ వీరశైవ కక్కయ్య డోర్ సమాజ్ అధ్యక్షుడు దత్తు పోలె, ఉమేశ్, వినోద్, ముకేశ్, రాజు, నర్సింగ్ గైక్వాడ్, రమేశ్ కాలే తదితరులు పాల్గొన్నారు.