రవీంద్రభారతి, జనవరి 26 : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని, ఆ పార్టీలో మాల సామాజికవర్గం అధికంగా ఉండడంతో వారు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఫిబ్రవరి 7న నిర్వహించే ‘లక్ష డప్పులు-వేల గొంతుకలు’ కార్యక్రమానికి తెలంగాణ ఎరుకల, ఆదీవాసీ సంఘం మద్దతుగా ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిన్రాజు మాట్లాడుతూ.. ‘లక్ష డప్పులు- వేల గొంతుకలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుడు వంశీతిలక్ మాట్లాడుతూ.. మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. అనంతరం మందకృష్ణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గంజి వంశీ, మందుల శ్రావణ్, రాము, బాబు, గుండేటి శంకర్, లోకిన్ రాజు పాల్గొన్నారు.