ఖైరతాబాద్, మార్చి 9: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవదిక రిలేదీక్షలు చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రాలతోపాటు అన్ని యూ నివర్సిటీల్లో ఈ దీక్షలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ చేపట్టొద్దని, వెంటనే గ్రూప్స్, ఇతర ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాడే వర్గీకరణ చేశాకే ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, నేడు మాట నిలబెట్టుకోకుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి గ్రూప్-1, 2, 3తోపాటు ఇతర ఉద్యోగ నియామక ఫలితాల ను ఈనెల 19 వరకు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దాని వల్ల దళిత కులాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నెల 12న శాసనసభ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొస్తామని సీఎం చెప్పారని.. ఆ ప్రక్రియ పూర్తికాకుండానే, ఉద్యోగాల భర్తీని ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నిం చారు. సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్, తెలంగాణ విఠల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందునరేశ్ మాదిగ, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ తదితరులున్నారు.
సూర్యాపేట టౌన్, మార్చి 9 : ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1,2,3 పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎ మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిరవదిక దీక్ష చేపట్టారు.