Manda krishna Madiga | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వర్గీకరణ చేయకుండానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, ధర్నా చేయాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ భవనం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహాం వద్దకు బయల్దేరిన మందకృష్ణ మాదిగను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకున్నా తమ ర్యాలీని కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఎల్బీ స్టేడియంలో ఉపాద్యాయ నియామక పత్రాలు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రిక ఎలా చేపడుతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయడానికే మాలలతో కుమ్మక్కై మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు, మాదిగల వాటా తేలే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరపొద్దని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | రాహుల్జీ.. మీకోసం అశోక్‌నగర్‌లో యూత్ ఎదురుచూస్తున్నారు.. కేటీఆర్ సెటైర్లు