కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపాయి. 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మంత్రి పొన్నం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించాయి. అడ్లూరిని బాడీ షేమింగ్ చేసేలా మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య దూరం పెంచినట్టు సమాచారం. ఎస్సీ నిధులతో నిర్మించతలపెట్టిన హాస్టల్ కార్యక్రమానికి కేవలం పొన్నంను మాత్రమే పిలిచేందుకు వర్సిటీ సిబ్బంది ప్రయత్నించగా విషయం తెలిసి అడ్లూరి ఫోన్‌చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయం పొన్నం వర్గీయులకు తెలియడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇద్దరి మధ్య దూరం పెంచినట్టు తెలుస్తున్నది.
తాజాగా అడ్లూరిపై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో పొన్నం దిష్టిబొమ్మను ఎమ్మార్సీఎస్ నాయకులు దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ కుమార్ మాట్లాడుతూ దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అవమానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకుండా కాలయాపన చేస్తూ దళిత జాతిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం మాటలకు పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ అడ్డుచెప్పకపోవడం దళిత జాతి మీద ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొన్నం ప్రభాకర్ క్షమాణ చెప్పకుంటే ఎక్కడికక్కడ ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈనెల 8న జిల్లాలోని ముఖ్యకూడళ్లలో పొన్నం దిష్టి బొమ్మలను దహనం చేస్తామని, 9న కరీంనగర్‌లోని ఆయన ఇంటిని, హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, పెగడపల్లి, ధర్మపురి, వెల్గటూర్, చిగురుమామిడిలో దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. పొన్నం దిష్టిబొమ్మను దహనం చేశారు.
దళితులంటే అందరికీ చులకనే : కొప్పుల
దళితులు ఏ స్థాయిలో ఉన్నా వివక్ష తప్పడం లేదని, ఇప్పటికీ కొందరు చులకనగా చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. దళితులపై వివక్షను మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ కాలం నుంచి ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉన్నదని విచారం వ్యక్తంచేశారు. దళిత ఉన్నతాధికారులు, జాతీయ స్థాయిలో అనేక మంది దళిత మేధావులపైనా వివక్ష బాధాకరమని పేర్కొన్నారు. బహుజన వాదం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ హకుల కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై జరిగిన దాడి, రాష్ట్ర దళిత మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు జాతికి జరిగిన అవమానాలుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులపై వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.