సిరిసిల్ల రూరల్, మార్చి 7: కోరగానే ఐదు గ్రామాల రైతుల పొలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్ చిత్రపటా నికి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశానని, దీనికే తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు చేటని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ.. బైరినేని రామును సోమవారం సస్పెండ్ చేసి న విషయం తెలిసిందే. ఈ మేరకు బైరినేని రాము.. తన సస్పెన్షన్ వేటుపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 500 మంది రైతుల పంట పొలాలకు నీళ్లిచ్చిన మంత్రి కేటీఆర్‌ను గౌరవించడం కనీస ధర్మమని, మంచి ఎవరు చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని హితవుపలికారు. రైతుల శ్రేయస్సు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకతీ తంగా పాల్గొంటానని స్పష్టం చేశారు.