స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 2 : బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.1.40 లక్షలు లంచం తీసుకొంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎంపీడీవో కుమారస్వామి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సరుగు వెంకటకిశోర్ ఏడు నెలల క్రితం హనుమకొండ జిల్లా ఐనవోలుకు బదిలీ అయ్యారు. వేతనం జమ కావాలంటే ఎంపీడీవో ఇచ్చే లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ (ఎల్పీసీ)ను ఐనవోలులో సమర్పించాల్సి ఉన్నది.
ఎల్పీసీ కోసం ఏడు నెలలుగా ఎంపీడీవో చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. రూ.2 లక్షలు లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని వేధించడంతో చివరికి రూ.1.40 లక్షలు ఇచ్చేందుకు వెంకటకిశోర్ అంగీకరించారు. ఆ మేరకు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో హనుమకొండలోని సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలో ఎంపీడీవో కుమారస్వామి.. వెంకటకిశోర్ నుంచి లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు. అదే రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్‌కు తీసుకొచ్చి కార్యాలయంలోని ఫైళ్లను, కంప్యూటర్లోని రికార్డులను పరిశీలించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా ఎంపీడీవో స్వగ్రామమైన కొడకండ్ల మండలం ఏడునూతులతోపాటు హనుమకొండలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీ హరీశ్‌కుమార్, సీఐలు శ్యాంసుందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.