హిమాయత్ నగర్, మార్చి 27 : సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వేములవాడకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో కొత్త రైల్వేస్టేషన్, బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. దీనికోసం పదేండ్ల క్రితమే భూ సేకరణ జరిగిందని. ఈ క్రమంలో పంటలు వేయలేక, క్రయవిక్రయాలు జరగక 300 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వాహనాల పార్కింగ్ కోసం గుడికి సమీపాన ఉన్న చెరువు పక్క భూములను గతంలో ప్రభుత్వం సేకరించి ఎకరాకు రూ. 94 లక్షల చొప్పున పరిహారం చెల్లిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడను సందర్శించిన సందర్భంలో భూములు కోల్పోయిన వారికి గతంలో కంటే మూడు రెట్లు పెంచి పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. భూముల మార్కెట్ ధర ఎకరాకు రూ. 3 కోట్లు ఉందని, ఆ విధంగా పరిహారం అందించి న్యాయం చేయాల్సిందిగా బాధిత రైతుల పక్షాన ఎంపీ రైల్వే మంత్రిని కోరారు. ఎంపీ వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : రైల్వేలో జర్నలిస్టుల రాయితీని పునరుద్ధరించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని పునఃప్రారంభించాలని కోరారు. జర్నలిస్టుల రాయితీ పథకంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.