జూబ్లీహిల్స్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు, రౌడీలు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే దౌర్జన్యాలకు దిగారని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన చిన్నా చితకా నాయకులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకం సృష్టించారని.. ఇవన్నీ చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందని.. అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నదని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. దొంగ ఓట్లు వేసేందుకు యూసుఫ్‌గూడలోని ఒక ఫంక్షన్హాల్లో మంగళవారం సాయంత్రం దొంగ ఓటర్లు మోహరించి ఉన్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తదితరులతో కలిసి అక్కడికి వెళ్తే రౌడీమూకలు తమపైనే దౌర్జన్యానికి దిగారని చెప్పారు.
పోలింగ్ స్టేషన్ పక్కనే కాంగ్రెస్ కార్యాయలం ఉండటం నిబంధనలకు విరుద్ధమని కూడాఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. అయినా ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. కాంగ్రెస్ గుండాలు దాడులకు దిగుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పటికీ పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాశారని విమర్శించారు. ఈ విషయమై డీజీపీ శివధర్‌రెడ్డికి.. ఉపఎన్నిక నిర్వహణలో వైఫల్యం చెందిన సీఈఓ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.