ఖమ్మం ; వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పత్తి రైతులు గోడు వినిపించడం లేదా అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా ఖమ్మం ఏఎంసీలోని పత్తి యార్డు ఎదుట ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. అంతకుముందు పత్తి యార్డును సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. రైతులు ఎన్ని క్వింటాళ్ల పత్తిని తెచ్చినా రూ.8,110 మద్దతు ధరకే కొనాలని డిమాండ్ చేశారు.
ఆంక్షలు లేకుండా కొనాలి : శ్రీనివాస్‌గౌడ్

వనపర్తి ; పత్తిని కొనుగోళ్లపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ సమీప బాలాజీ జిన్నింగ్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సీసీఐ విధానాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, జిన్నింగ్ మిల్లుల సమ్మె మరింత కష్టాన్ని తెచ్చి పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తూకం వేసిన సోయాను వెనక్కి తీసుకోవాలి..

కుంటాల ; సోయా పంట నాణ్యత లేదని వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరులో రైతులు, రైతు సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. రెండు గంటలపాటు భైంసా-నిర్మల్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అన్ని కేంద్రాలకు సర్వేయర్లను పంపుతామని మార్క్‌ఫెడ్ ఎండీ ప్రవీణ్, తహసీల్దార్ కమల్‌సింగ్ తెలుపడంతో ఆందోళన విరమించారు. అనంతరం డ్యామేజీ 3 నుంచి 10శాతానికి పెంచాలని, సోయా కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
వరంగల్ జిల్లా రాంధన్తండాలో నిరసన

వర్ధన్నపేట ; కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15రోజులైనా ధాన్యం కాంటా పెట్టడం లేదని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్తండాలో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా తూకం వేసి మిల్లులకు తరలించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కొత్త నిబంధనతొలగించాలి: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

పత్తి రైతులను నిబంధనల పేరుతో సీసీఐ ఇబ్బంది పెట్టడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీప ఎస్ఎస్వై జిన్నింగ్ మిల్లు వద్ద ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలను తొలగించి మద్దతు ధ రకే పత్తి కొనాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధరకు కొనాలి: సబితా ఇంద్రారెడ్డి

పూడూరు ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో పత్తి కొనుగోళ్లు నిలిపేసిన రాకంచర్ల, సాయిబాబా జిన్నింగ్ మిల్లులను మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కేసీఆర్ సర్కారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామని, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే విక్రయించాలని నిబంధనలు పెట్టడం సరికాదని మండిపడ్డారు.