హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్న భావన రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ బలపడుతుంది. ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందిస్తారు’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న పార్టీ నిర్వహించే రజతోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్నిరంగాల్లో జరుగుతున్న వివక్షకు నిరసనగా కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని తృణప్రాయంగా త్యజించి 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఉద్యమనేతగా కేసీఆర్ అహింసామార్గాన ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాక, అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగ్రామిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉన్నతవిద్యను అన్ని వర్గాల వారికి చేరువ చేశారని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో గురుకులాలు స్థాపించారని, విదేశీ విద్య కోసం బలహీన వర్గాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారని గుర్తుచేశారు.
ప్రగతిని పరుగులు పెట్టించిన కేసీఆర్
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న జీఎస్డీపీ రూ.5,05,849 నుంచి 2023 నాటికి రూ.15,10,000కు, తలసరి ఆదాయం రూ.1,24,104 నుంచి 2023 నాటికి 3,56,000కు చేరేలా కేసీఆర్ తన పాలనా దక్షత ప్రదర్శించారని కొనియాడారు. వేగవంతంగా సాగునీటి అవకాశాలను పెంచిన కేసీఆర్.. 2023 నాటికి 233 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచి దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దారని వివరించారు. ఐటీ ఉత్పత్తులు 2014 నాటికి కేవలం రూ.57,000 కోట్లు ఉంటే 2023 నాటికి దానిని 2,70,000 కోట్లకు చేరేలా చొరవ చూపారని చెప్పారు.
చెరిపినా చెరగని కేసీఆర్ ఆనవాళ్లు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు కలకాలం నిలిచిపోతాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించి రాష్ట్ర సచివాలయం దేశంలోనే అద్భుత కట్టడంగా నిలిచిందని కొనియాడారు. దాని సమీపంలోనే 125 అడుగుల అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారని తెలిపారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేసి అధునాతన సదుపాయాలతో ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మించారని వివరించారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరారని తెలిపారు.