పార్లమెంట్లో బీఆర్ఎస్ పక్ష నేతగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ మేరకు గురువారం నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. వద్దిరాజు రవిచంద్ర పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు గురుతర బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వద్దిరాజును పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖను కేసీఆర్ ఆయనకు అందజేశారు. అనంతరం రవిచంద్రను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సూచించారు. వద్దిరాజు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.
పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించిన కేఆర్ సురేశ్‌రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో వద్దిరాజును ఎంపిక చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర బహుజనులకు, పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ శాసనమండలికి వెళ్లారు. ఆయన స్థానంలో తొలిసారి వద్దిరాజును రాజ్యసభకు పంపించారు. తాజాగా రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనతోపాటు రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థ సారథిరెడ్డి కొనసాగుతున్నారు. రవిచంద్ర 2030 ఏప్రిల్ వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీసంఘం, బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. బలహీన వర్గాలకు చెందిన తనను రెండుసార్లు రాజ్యసభకు పంపించడమే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తానని, తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో మరింత బలంగా వినిపిస్తానని తెలిపారు. పార్టీ పటిష్టానికి, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఉద్ఘాటించారు.
మొదటి నుంచి బలహీనవర్గాలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి బీసీ బిడ్డకు సముచిత గౌరవమిచ్చారు. ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన వద్దిరాజు రవిచంద్రను రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. తాజాగా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేసి గురుతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి కొనసాగుతున్నారు. గతంలోనూ ఆయనకు స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ను గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికచేశారు. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా కొనసాగుతున్నారు. మరో బీసీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. ఎల్ రమణను కౌన్సిల్ డిప్యూటీ లీడర్‌గా ఎంపికచేశారు. మొత్తంగా పార్టీకి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కీలకమైన స్థానాల్లో బీసీలను నియమించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియాకమైన వద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, మెచ్చా తదితరులు రవిచంద్రతో కేక్ కట్ చేయించారు. వద్దిరాజు నియామకంపై మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమ్పటేల్ హర్షం వ్యక్తంచేశారు. కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.