హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌కుమార్ ఒక రుషిలా నిరంతరం పరితపిస్తున్నారని బ్రహ్మకుమారీస్ మాతా కుల్దీప్ దీదీ అభినందించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో ఆదివారం మొకలు నాటే కార్యక్రమమైన కల్పతరువు-2 సీజన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మకుమారి సమాజంలో ఐదేండ్లపాటు సేవ తర్వాత అందించే బ్యాడ్జీని సంతోష్‌కుమార్‌కు అందిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో కల్పతరువు-1 కన్నా ఎక్కువ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తొలిదశలో బ్రహ్మకుమారీలు 16 లక్షల మొక్కలు నాటడం వారి సంకల్ప బలానికి నిదర్శనమని కొనియాడారు. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా తాము, కల్పతరువు ద్వారా బ్రహ్మకుమారీలు మొక్కలు నాటుతుండటం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్లు కరుణాకర్‌రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.