హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుందని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తెలిపారు. ప్రాణకోటికి జీవనాధారమైన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీ సమాజం ‘కల్పతరు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్యఅతిధిగా మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమంతా బాధ్యతను మరోసారి గుర్తుచేసుకుందామని, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని పిలుపు ఇచ్చారు. ప్రకృతిపై మనకు హక్కుతోపాటు బాధ్యత కూడా ఉండాలని చెప్పారు. భావితరాలకు పచ్చని బతుకునివ్వాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని, లేకపోతే మనం కూర్చున్న కొమ్మను నరుకున్నట్టేనని తెలిపారు.
మన అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నామని, అడవులను నరికివేస్తున్నామని, వాతావరణాన్ని, నీటిని కలుషితం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటున్నాయని, మనతో సమానమైన జీవన హకులున్న జీవరాశులు అంతరించి పోవడానికి కారణమవుతున్నాని పేర్కొన్నారు. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే వచ్చే పదేండ్లలో సుమారు 10 లక్షల జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని సర్వేలు ఘోషిస్తున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ ‘హరితహారం’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, దీనిలో భాగంగా గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 240 కోట్లకుపైగా మొక్కలను నాటగలిగామని, దాదాపు 8% అడవులను అదనంగా పెంచగలిగామని చెప్పారు. పర్యావరణ రక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తుచేస్తూ.. ‘రండి.. చేయి చేయి కలుపుదాం. పర్యావరణ పరిరక్షణకు మన వంతు తోడ్పాటును అందిద్దాం’ అని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు ఇచ్చారు.
‘కల్పతరు’లో 40 లక్షల మొక్కలు నాటేందుకు కృషి
ఆధ్యాత్మికత, యోగా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రహ్మకుమారీ సమాజం.. 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొకలు నాటాలనే సంకల్పంతో ‘కల్పతరు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 5 నుంచి ఆగస్టు 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 40 లక్షల మొకలు నాటేందుకు కృషి చేస్తున్నట్టు బ్రహ్మకుమారీలు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతోష్ కుమార్కు రాజయోగిని బీబీ కుల్దీప్ దీదీజీ కృతజ్ఞతలు తెలిపారు.