హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిన్ దాపురించిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) మండిపడ్డారు. దేశ ప్రజలు జీడీపీ పెంచాలని ఆశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం జీడీపీని గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలను అసమానంగా పెంచుతుందని ఆయన మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో ఆయన 377 నిబంధన కింద కేంద్రాన్ని నిలదీశారు.
ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ధరలను తగ్గించాలని ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్‌పై ధరను పెంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరలను పెంపుతో మరింత భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. 2014లో ఉన్న ధరల కంటే గ్యాస్ సిలిండర్ ధరను 2.5 రెట్లు పెంచారని వివరించారు. ఈ సంవత్సరం మార్చిలో ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్ రూ.1100 ఉంటే ఈనెల 6న రూ. 50లు పెరిగిందని, దీంతో మొత్తం రూ. 1150లకు చేరిందన్నారు. అదే 2014 మార్చిలో కేవలం రూ. 410 ఉందన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.