హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అసెంబ్లీ, పార్లమెంటులో బీసీలకు 50 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు తీర్మానించాయని పేర్కొన్నారు. రాజకీయ అధికారం ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమని, న్యాయమైన వాటా లభించనంతవరకు సామాజిక న్యాయం సాధ్యంకాదని తెలిపారు.
54 శాతం జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేనందున ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,600 బీసీ కులాలుండగా, 75 ఏండ్లలో చట్టసభల్లోకి కేవలం 50 బీసీ కులాలు మాత్రమే ప్రవేశించాయని తెలిపారు. పార్లమెంటు సభ్యుల్లో బీసీల వాటా కేవలం 15 శాతం మాత్రమేనని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించినా బీసీల సంక్షేమానికి సంబంధించి ఒక్క సవరణ కూడా చేయలేదని పేర్కొన్నారు. అన్ని కులాలకూ సమ ప్రాతినిధ్యం లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం కాజాలదని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు క్యాబినెట్లలో బీసీలకు అప్రధాన శాఖలు కేటాయించి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని, దీనివల్ల బీసీ వర్గాల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు.