హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పోలీసు శాఖలో 18 వేల కానిస్టేబుళ్లు, ఎస్ఐ తదితర పోస్టులు, విద్యాశాఖలో 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. వర్సిటీల్లో ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు 80 శాతం ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రూప్-1 కింద 1,600 పోస్టులు, గ్రూప్-2 కింద 3,000 పోస్టులు, గ్రూప్ 3-4 కింద 20 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగులను విస్మరించడం తగదని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నెల 20న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.