రవీంద్రభారతి, జనవరి 1: కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని జోస్యం పలికారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను హస్తం పార్టీ చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు.
అధికారంలోకి రాకముందు విద్యార్థులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొని నేడు వారిని గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఉద్యమాలు చేసినా సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, హాస్టళ్లకు సొంత భవనాలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్వో కార్యాలయాల ముట్టడి, 5న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆయా కార్యక్రమాలను విజయవంత చేసి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నీల వెంకటేశ్, నందగోపాల్, రవియాదవ్, రాజునాయక్, నిమ్మల వీరన్న, మోదే రామ్‌దేవ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.