హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రైతులకు తీవ్ర నష్టదాయకంగా పరిణమించిన ప్రతిపాదిత డోర్నకల్-మిర్యాలగూడ రైల్వేలైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరుతూ లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్, దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్‌కు మంగళవారం లేఖలు రాశారు. మోటమర్రి-విష్ణుపురం మార్గాన్ని ప్రత్యామ్నాయ మా ర్గంగా ఎంచుకోవాలని సూచించారు. డోర్నకల్-మిర్యాలగూడ కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ వల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని వివరించారు. ఈ గ్రా మాల మీదుగా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్‌ను ప్రతిపాదించడంతో కోట్ల విలువైన భూము లు, పేదల గృహాలు, రియల్ఎస్టేట్ వెంచర్ల ప్లాట్లు కోల్పోయి, ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని పేర్కొన్నా రు.
గతంలో హైవేలు, ఇతర అవసరాలకు రైతులు తమ విలువైన భూములను జాతీయ ప్రయోజనాలరీత్యా త్యాగం చేశారని, ఇప్పు డు మరోసారి అరకొరగా మిగిలిన భూము లు, విలువైన ప్లాట్లు, నివాస గృహాలు వదులుకోవడానికి సిద్ధంగా లేరని, ఈ రైలు మా ర్గానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయా పంచాయతీలు తీర్మానాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభావిత గ్రామాల్లో ఎకువుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలేనని, రైల్వేశాఖ ప్రతిపాదనలపై వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.