హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో జీఎస్టీ విషయంలో పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారానికి సెంట్రల్ జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీ హామీ ఇచ్చారని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అతి త్వరలోనే వ్యాపారులు ఎదుర్కొంటున్న జీఎస్టీ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. సోమవారం నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీని కలిసి, వినతిపత్రం అందజేసింది.
ఖమ్మం పత్తి వ్యాపారులు అవగాహన లేక 2017 నుంచి 2019 వరకు రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం) విధానంలో జీఎస్టీ చెల్లించారని జోహ్రీకి నామా నాగేశ్వర్రావు తెలిపారు. కానీ ఖమ్మంలోని జీఎస్టీ అధికారులు మొదటి నుంచి అమ్మకాలు, కొనుగోళ్లపై జీఎస్టీ కట్టలేదని చెప్పి, పాత బకాయిలు కూడా కట్టాలంటూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. పాత విధానంలోనే పత్తి వ్యాపారులు జీఎస్టీ కట్టినా దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని జీఎస్టీ చైర్మన్కు నామా విజ్ఞప్తి చేశారు. నామా వినతిపై వివేక్ జోహ్రీ సానుకూలంగా స్పందించారని ఖమ్మం వ్యాపార ప్రతినిధులు తెలిపారు.