హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై శనివారం రాత్రి ఈగల్ టీమ్ దాడి చేసి ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్యాదవ్తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్వహించిన మూత్ర టెస్టులో మహేశ్యాదవ్కు నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు రక్త నమూనాలను సేకరించారు.
ఈ మేరకు ఆదివారం వచ్చిన ఫలితాల్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏలూరు ఎంపీపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తక్షణమే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. చట్టాన్ని గౌరవించే పార్టీ అని చెప్పే టీడీపీ.. ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే వెంటనే మహేశ్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.