హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): జీఎస్టీ వంటి సంస్కరణల ద్వారా సామాన్యులకు సైతం ఎంతో మేలు జరిగినప్పటికీ, దేశంలో అసమానతలు పెరిగిపోయాయని పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నేత ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. అసమానతలను తగ్గించడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో సైతం గూండాయిజం పెరిగిపోతున్నదని, భూకబ్జాలు, భూవివాదాలు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
పటిష్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వీటిని అడ్డుకోవచ్చని సూచించారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా 11 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించినట్టు రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన మిషన్ భగీరథ పథకం దీనికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశాన్ని ఐదో అతిపెద్ద ఎకానమీగా తీర్చిదిద్దినట్టు రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడాన్ని స్వాగతించారు. ఐటీ, జీఎస్టీ వంటి సంస్కరణల వల్ల కూడా పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూరిందని ప్రశంసించారు.
అదే సమయంలో దేశంలో అసమానతలు వేగంగా పెరుగుతున్నాయని, ఇది అతిపెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా భూమి, నీరు విషయంలో అసమానత ఉన్నదని వివరించారు. 50% మంది వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని తెలిపారు. ఇప్పటికీ వ్యవసాయానికి నీటి ఎద్దడి కొనసాగుతున్నదని, దాదాపు 70 వేల టీఎంసీల వర్షపు నీరు సముద్రంలో కలుస్తున్నదని ఆవేదన వివరించారు.
కృష్ణా, గోదావరి, కావేరి, నర్మద తదితర మేజర్ నదులకు సంబంధించిన జలవివాదాలు కొనసాగుతున్నాయని సురేశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఇవి పరిష్కారమవుతాయని, కానీ ఆ చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం కొరవడిందని పేర్కొన్నారు. నదీజలాల వివాదాలు పరిష్కారం కాకపోతే రైతులు పడుతున్న ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం లేదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఆన్ అండ్ ఆఫ్ సిస్టం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో సుమారు 16 వేల ఎకరాలకు నీటిని అందించామని వివరించారు.
కనీసం నదీ జలాల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రత్యామ్నాయ విధానాలను అమలుచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పైప్‌లైన్ ద్వారా నీరు పారిస్తూ ఒక్క టీఎంసీతో 18 వేల ఎకరాలకు నీటిని అందించినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వం చెప్తున్న సంస్కరణల్లో ఇటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. మారుమూల ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ విధానం ద్వారా సాగునీరు అందించవచ్చనని పేర్కొన్నారు. దేశంలో అనేక చెరువులు కనుమరుగయ్యాయని, కానీ తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మిషన్ కాకతీయ పథకం ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించారని గుర్తుచేశారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం ద్వారా ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్-1 స్థానానికి ఎదిగిందని సురేశ్‌రెడ్డి వివరించారు. కేసీఆర్ అమలుచేసిన విధానాలతో తెలంగాణ అభివృద్ధి చెందడంతోపాటు దేశాభివృద్ధిలో భాగస్వామిగా నిలిచిందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో సైతం కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడారని గుర్తుచేశారు. ఏ రాష్ట్రంతోనూ వివాదాలు లేకుండా, తమకు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించి కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేసినట్టు తెలిపారు.
ఇది అభివృద్ధి నమూనాగా నిలిచిందని వివరించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో మూడు బరాజ్‌లు ఉంటే, అందులో మూడు పిల్లర్లకు మాత్రమే కొంత నష్టం జరిగితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లుగా వాటికి మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించి పిల్లర్లకు మరమ్మతు చేయాలని సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేయడంలేదని మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సైతం రిపేర్లు చేయాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు.
డ్యామ్ రిహ్యాబిలిటేషన్ ప్రోగ్రాం కింద రెండేండ్ల కిందటే కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర సర్కార్ ఇంతవరకు ఒక్క పైసా ఖర్చుచేయలేదని తెలిపారు. అంత పెద్ద డ్యామ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉంచడం సరికాదని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనివల్ల జీడీపీపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా రైతులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
నదీ జలాలతోపాటు మరో ప్రధాన సమస్య భూ వివాదాలని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. భూములు కబ్జాకు గురికాకుండా ఉండాలంటే, యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లని రీతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తేవాలని కోరారు. గ్రామాల్లోనూ గూండాయిజం, భూకబ్జాలు, భూవివాదాలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎన్నికల ఖర్చు పెరిగిపోతున్నదని, సర్పంచ్ పదవి నుంచి ఎంపీ వరకు గెలిచేందుకు కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తున్నదని, ఆ డబ్బును సంపాదించేందుకు భూముల్లో వివాదాలు సృష్టించి, వివాదాల పరిష్కారం పేరుతో వాటిని కబళిస్తున్నారని పేర్కొన్నారు. భూ వివాదాలతో పేదలు నష్టపోతున్నారని, టైటిల్ క్లియర్‌గా లేకపోవడంతో వారికి ఎక్కడా రుణాలు లభించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 2008లోనే రూపొందించినప్పటికీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని, ఇకనైనా పకడ్బందీగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలుచేయాలని కోరారు.
దీనివల్ల రాజకీయాల్లో గూండాయిజాన్ని, గూండాలను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. కోర్టుల్లో ఉన్న సివిల్ కేసుల్లో 65% భూవివాదాలకు సంబంధించినవేనని చెప్పారు. భూ వివాదాలు లేకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం ధరణి కార్యక్రమాన్ని రూపొందించి అమలుచేసిందని సురేశ్‌రెడ్డి వివరించారు. దూరదృష్టితో తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆయనపై ఫోన్ ట్యాపింగ్ నిందెలు మోపుతున్నదని విమర్శించారు.