KR Suresh Reddy | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, మా మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడొద్దని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో చంద్రయాన్ -3 విజయంపై మాట్లాడిన సందర్భంగా బుధవారం సురేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలామంది ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.
ఏపీ, తెలంగాణను సైంటిఫిక్‌గా విభజించలేదని పదేపదే మాట్లాడడం సరికాదన్నారు. సైంటిఫిక్‌గా విభజన జరగలేదంటున్న ప్రధానమంత్రి దాన్ని సరిచేయడానికి 9 సంవత్సరాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి సవరణలు తీసుకవచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు తగదన్నారు.
తొమ్మిదేళ్లలో ఏ సమస్య పరిష్కరించారో చెప్పాలన్నారు. నీటి వివాదాలు, నీటి కేటాయింపులు చేశారా? అంటూ నిలదీశారు. తెలంగాణకు ఏమైనా ప్రత్యేక కేటాయింపులు చేశారా ? అంటూ ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అందరం కలిసే ఉంటున్నామన్నారు. చంద్రయాన్-3 విజయం దేశానికి గర్వకారణమన్నారు. ప్రపంచానికి మన సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటిచెప్పామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను బీఆర్ఎస్ అభినందిస్తున్నామన్నారు.