హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): ఆత్మహత్యలకు ఆయుధంగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్(గడ్డిమందు)ను దేశవ్యాప్తంగా నిషేధించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. పారాక్వాట్ వినియోగంతో నేల, నీరు, ఇసుక తీవ్రంగా కలుషితమవుతున్నాయని వాపోయారు. ఈ గడ్డిమందు ప్రభావం కేవలం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారిందని స్పష్టంచేశారు. పారాక్వాట్ను సేవించి వేలాదిమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడిన విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి విరుగుడు లేకపోవడంతో ప్రాణాలు కోల్పొవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. ప్రమాదకర రసాయనాలకు బదులు సురక్షిత ప్రత్యామ్నాయాలు ప్రోత్సహించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు.