హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై భేషజాలకు పోవద్దని రేవంత్ సర్కార్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లివ్వకుండా రైతులను శిక్షించే అధికారం రేవంత్‌రెడ్డికి లేదని చురకలు అంటించారు. కన్నెపల్లిపైన ఉన్న అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి డ్యామ్‌లు, పంపు హౌస్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. కన్నెపల్లిలో 50 వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చాక పంప్‌హౌస్ లోపలికి నీళ్లు వస్తాయని, వాటిని పంప్ చేసుకునే అవకాశం ఉన్నదని సూచించారు. లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ తాగు నీటి అవసరాలు కృష్ణా, గోదావరి మీదనే ఆధారపడి ఉన్నాయని, కావున వెంటనే నీళ్లను పంప్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో కుంగిపోయిన ఒక్క పిల్లర్‌ను సాకుగా చూపి మిగతా ప్రాజెక్టును వినియోగించుకోకపోవడం ఏంటీ..? అని ప్రశ్నించారు.