Etela Rajender | హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల బడ్జెట్లో మతలబేం టో తెలిసేదాకా ప్రతిఘటన తప్పదని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టాలని, వచ్చేందుకు తాము సిద్ధమ ని సీఎం రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లేఖరాశారు. హైడ్రా సంస్థకు, మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదని వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లోని చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించకుండా, 40 ఏండ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, అనుమతించిన లే అవుట్లలో ఇల్లు కట్టుకున్న పేదలను భయబ్రాంతులకు గురిచేస్తూ అడ్డగోలు కూల్చివేతలు చేపట్టడాన్నే వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు.
పట్టాభూము ల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్‌జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా ? అంటూ నిలదీశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారించకుండా కూల్చివేత లు ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. సర్కార్ తీరుతో హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్నదని విమర్శించారు.