హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పీఠం విషయంలో రాజుకున్న వివాదం మరింత ముదిరింది. తాజాగా శామీర్‌పేటలో హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వేదికగా ఎంపీ ఈటల శనివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రత్యర్థిని ఉద్దేశించి ‘బీ కేర్‌ఫుల్ కొడకా’ అంటూ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈటల వ్యాఖ్యలు మరో ఎంపీని ఉద్దేశించే అని పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఎవడో సైకో, శాడిస్ట్, వాడు మనిషో, పశువో.. నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం శత్రువులతో కొట్లాడతాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు కొడకల్లారా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై ఏమేమీ పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారో మొత్తం వివరాలను అధిష్ఠానానికి పంపుతా అని హెచ్చరించారు. పార్టీలో ఇలాంటి వాటిని అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోవాలని కోరారు.
తన మీద కుట్రలు చేసే వారి శక్తి, యుక్తి, చరిత్ర ఏంటని ఈటల ప్రశ్నించారు. ‘మా చరిత్ర మీకు తక్కువ తెలుసు కొడకా.. అంటూ తనపై దుష్ప్రచారం చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు. ధీరుడు వెనుదిరగడని, ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసని పేర్కొన్నారు. నాయకుడంటే పడి చచ్చే క్యాడర్ ఉంటుందని, క్యాడర్ అంటే పడి చచ్చే నాయకుడూ ఉంటాడని.. డ్రామా కంపెనీలా మీద మీద పనిచేసే వారికి విలువలు ఎలా తెలుస్తాయి.. ? అని ప్రశ్నించారు. తన జోలికి రావొద్దని.. తనకు అడ్డురావొద్దని హెచ్చరించారు.
ఇటీవల హుజురాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఎక్కడా లేని పంచాయితీ హుజూరాబాద్‌లోనే ఎందుకు వచ్చింది? పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి టికెట్లు ఇవ్వాలా..? అంటూ బండి ప్రశ్నించారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈటల వర్గం నేతలు శనివారం శామీర్‌పేట ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. బండి పేరు ప్రస్తావించకుండా ఈటల చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.