హైదరాబాద్: వికారాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపడమేంటని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడమంటే.. తన హక్కులను ఉల్లంఘించడమేనని చెప్పారు. పోలీసులు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. లగచర్లలో ఎస్టీ రైతులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
బుధవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులతోపాటు కలెక్టర్ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వార్డు మెంబర్ కూడా కాని తిరుపతిరెడ్డిని ఎస్కార్ట్‌తో పంపించిన పోలీసులు, ఎంపీనైన తనను అడ్డగించి అవమానించడం ఏంటని ప్రశ్నించారు. అరుణను అడ్డగించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు తనను అడ్డుకున్న విషయాన్ని అరుణ ఫోన్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీని పంపించాలని పోలీసులకు కలెక్టర్‌కు చెప్పడంతో వారు వికారాబాద్ పంపించారు.