హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రతిపాదన విషయంలో.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చని పేర్కొన్నారు. సువేందు అధికారి, ఏక్నాథ్ షిండేలాగే రేవంత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చారేమో! అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం తమ పార్టీ తప్పేనని, ప్రజలు తమను కోరుకోలేదన్నది నిజమని స్పష్టంచేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రాగలుగుతున్నా, తెలంగాణలో మాత్రం అధికారం చేరువలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇందు కు స్థానిక నాయకత్వ సమస్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో పెద్ద గ్రూప్ లీడర్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో వివాదంపై స్పందిస్తూ.. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటాయని, అయితే తాను ఎవరిపై ఫిర్యాదులు చేయలేదని తెలిపారు.
బండి భగీరథ్‌పై పోక్సో కేసు వెనుక తాను ఉన్నాననే ప్రచారంపై స్పందిస్తూ.. ఆ ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టంచేశారు. పోక్సో కేసు తర్వాత బండి సంజయ్‌తో తాను మాట్లాడలేదని చెప్పారు. 2019లో బండికి టికెట్ ఇవ్వాలని కోరిన వారిలో తాను మొదటి వ్యక్తిని అని, తాను రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని కోరితే, కొత్తగా పార్టీలోకి రావడంతో కుదరదని అధిష్ఠానం తేల్చి చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సగం క్యాబినెట్లో క్వాలిటీ కాంగ్రెస్ లేదని, సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర పనిచేసేందుకు మంత్రులే ఇష్టపడటం లేదని, తెలంగాణలో వామపక్ష భావజాలం లేదని అరవింద్ అభిప్రాయపడ్డారు.