నిజామాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు వెంటాడుతున్నది. సరిగ్గా మూడేండ్ల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని నిజామాబాద్ నాలుగో టౌన్లో కేసు నమోదైంది. ఈ విషయమై నోటీసు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించారు. అయితే.. అందుబాటులో లేరు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎంపీ అర్వింద్ ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు.
నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు. నోటీసు తీసుకోవాలని కోరగా.. తీసుకునేది లేదంటూ మొండిగా వాదించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు లేదంటే అధికారిక మెయిల్ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు వెల్లడించారు. నోటీసు జారీపై నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా అది నిజమేనని చెప్పారు. నోటీసును ఎంపీ తీసుకోలేదని, ఉన్నతాధికారుల సూచనలతో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.