హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యా దవ్ మరోసారి తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నే అందుకు నిదర్శనం. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణాజలాల పునః పంపిణీ పై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తున్నది. తెలంగాణ వాదనలు ముగియగా, ఏపీ వాదనలు ఇటీవల ప్రారంభమయ్యాయి. అయితే ఎంపీ అనిల్‌కుమార్ మాత్రం ట్రిబ్యునల్ తుది నివేదిక సమర్పించిందా? సమర్పించకపోతే అందుకు కారణాలేమిటి? అంటూ పార్లమెంట్లో ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
ట్రిబ్యునల్‌పై కనీస అవగాహన ఎంపీకి లేదని తేలిపోయింది. గతంలో బనకచర్ల అంశంలో నూ ఈ ఎంపీ ఇదేవిధంగా అభాసుపాలవడం గమనార్హం. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నందున తుది నివేదిక సమర్పించేందుకు మరింత గడువు కావాలని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) కోరిందని, ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ గడువును గత ఆగస్టు నుంచి వచ్చే జూలై వరకు ఏడాది కాలం పొడిగించామని వెల్లడించారు.
పటేల్ చెరువు పనులకు రూ.59 లక్షలు
మెదక్ జిల్లా నర్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామం పటేల్ చెరువు, అమ్మకుంట, తాతకుంటల అభివృద్ధి పనులకు రూ.59 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.