హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): ‘ఉద్యమం ద్వారా పాలకులకు సరైన బుద్ధిచెప్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొస్తాయి. యువత రోడ్డెక్కితేనే కాంగ్రెస్ (Congress) పాలకులకు వణుకు పుడుతుంది. ఇప్పటికైనా నిరుద్యోగ యువత సంఘటితమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ఆమరణ దీక్షలకూ వెనుకాడవద్దు’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్‌లో శుక్రవారం ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేసీఆర్ లాంటి సమర్థుడైన నేతను ఓడించడం రేవంత్‌రెడ్డి వల్ల సాధ్యమయ్యే పనికాదని వ్యాఖ్యానించారు. ఆనాడు కాంగ్రెస్‌తో నిరుద్యోగులు కలవడంతోనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని స్పష్టంచేశారు. రథయాత్రలు చేసి, ఊర్లకు వెళ్లి ప్రచారం చేసి గెలిపించిన నిరుద్యోగ యువతను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గద్దెనెక్కిన తర్వాత ఏనాడూ ఉద్యోగ ఖాళీల భర్తీపై ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి 2 లక్షల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని పునరుద్ఘాటించారు.
నిరుద్యోగుల పోరుకు అండగా ఉంటాం: జాన్‌వెస్లీ
నిరుద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఎం అండగా ఉంటదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న రాష్ట్రంలోని కాంగ్రెస్, రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాలు.. ఇవ్వకుండా నిరుద్యోగలకు మోసంచేశాయని ఆరోపించారు. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు వారినోట్లో మట్టిగొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారి బతుకులతో ఆటలాడుకోవద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ నిగ్గుతేల్చేందుకే బాకీకార్డులు: రాకేశ్‌రెడ్డి
నిరుద్యోగులను మోసంచేసిన కాంగ్రెస్ సర్కారు నిగ్గు తేల్చేందుకే ‘నిరుద్యోగ జేఏసీ బాకీ కార్డు’ రూపొందించడం అభినందనీయమని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. వేలంలో మాదిరిగా ఓట్ల కోసం నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారిని దగా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, యువతకు రాజీవ్ యువవికాసం కార్డులు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
ముఖ్యమంత్రివా.. అటెండర్‌వా?: అశోక్
అసలు ముఖ్యమంత్రివా? లేక అటెండర్‌వా? అంత ఖాళీగా ఉన్నావా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ విమర్శించారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. చివరకు శిక్షణ పొందిన సర్వేయర్లకు సైతం నియామకపత్రాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులు ఇప్పుడు అరిగోస పడాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఘనంగా మ్యానిఫెస్టో తెచ్చిన కాంగ్రెస్.. మమ్మల్ని ఏమార్చి ఆ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఇప్పుడు అదే ఓటుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.
10 వేల ఉద్యోగాలైనా ఇవ్వలేదు: ఝాన్సీరాణి
ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకొచ్చిన రేవంత్‌రెడ్డి.. ‘రెండు నెలలు పుస్తకాలు పక్కనబెట్టండి.. మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తాం’ అని హామీ ఇప్పించి నిరుద్యోగ యువతను నమ్మించారని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఝాన్సీరాణి తెలిపారు. ఇప్పుడు రెండేండ్లయినా కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీచేయలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులను దగా చేసిన కాంగ్రెస్ సర్కారును గద్దెదింపేందుకు ఇప్పుడు నిరుద్యోగులందరూ ఏకంకావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేత గడ్డం శ్రీనివాస్, నిరుద్యోగ జేఏసీ నాయకులు నీలం వెంకటేశ్, లలితారెడ్డి, మోతీలాల్, జనార్దన్, శంకర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను బొందపెట్టాలి: గెల్లు శ్రీనివాస్
అలవికానీ హామీలిచ్చి నిరుద్యోగ యువతను నిండాముంచిన కాంగ్రెస్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బొందపెట్టాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులు నాడు రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి ఇప్పుడు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి మోసపూరిత కాంగ్రెస్‌ను ఎండగట్టాలని నిరుద్యోగ జేఏసీకి పిలుపునిచ్చారు.