నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రామన్నపేట జనం ఐక్య రణానికి సిద్ధమన్నది. పోరుబాటలో బీఆర్ఎస్ పార్టీ ముందుండగా, సీపీఎం, సీపీఐ ఐక్యపోరాటాలకు సిద్ధమేనని స్పష్టంచేశాయి. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు భాగమవుతాయని ముందుకొచ్చాయి.అఖిలపక్ష కమిటీలు, పర్యావరణ పరిరక్షణ వేదికగా అవిశ్రాంత పోరాటాలకు ఈ ప్రాంత ప్రజలు రణనినాదం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన వ్యతిరేకతనే ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌కు కదిలివచ్చారు.ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి నివేదించాలని గురువారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంతు కే జెండగేని కలిసి అఖిలపక్షం, పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అఖిలపక్షం, పర్యావరణ పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల జెండాలకు తావులేకుండా ఒక్కతాటిపై ‘అదానీ గోబ్యాక్’ అన్న ఒక్కటే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. అదానీ కంపెనీ ప్రతినిధులు వీరి ఐక్యతకు విఘాతం కలిగించేలా కుట్రలు చేసినా వీరి పోరాట పటిమ ముందు ఫలించలేదు.
రామన్నపేట ఉనికిని ప్రశ్నార్థకం చేసే అదానీ సిమెంట్ కంపెనీపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఎం, సీపీఐ నేతలు జిల్లెల పెంటయ్య,ఊట్కూరి నర్సింహ స్పష్టంచేశారు. గురువారం రామన్నపేటలో వారు మీడియా తో మాట్లాడారు. అదానీ సిమెంట్ కంపెనీ ఏర్పాటు విషయం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో నికరమైన పోరాటం సాగిస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 40 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో దశలవారీగా సాగుతున్న పోరాటంలో సీపీఎం, సీపీఐ, వామపక్ష ప్రజాసంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అదానీ తన కంపెనీని రద్దు చేసుకునే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
రామన్నపేటలో అదానీ కంపెనీ ఏర్పాటును తమ పార్టీ నూటికి నూరుశాతం వ్యతిరేకిస్తుందని సీపీఎం నేత ఎండీ జహంగీర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రజలతో కలిసి తమ పార్టీ పోరుబాటలో ముందున్నదని పేర్కొన్నారు. అదానీ కంపెనీ ఏర్పాటు నిర్ణయం రద్దయ్యే వరకు సాగే పోరులో కమ్యూనిస్టులుగా తామూ ముందుంటామని ఎండీ జహంగీర్ తెలిపారు.
రామన్నపేట, అక్టోబర్ 24: రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతులు ఇవ్వకుండా చిత్తశుద్ధిని చాటుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హితవు పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయించాలని కోరారు. ఈ విధంగా వారు ప్రజలకు మేలు చేస్తే పరిసర గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను పోటీలో నిలబెట్టబోమని చిరుమర్తి ప్రకటించారు.