ఖైరతాబాద్, జనవరి 27: ఎస్సీ వర్గీకరణ పోరాటమే కాదు.. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు ఏదైనా కష్టం వస్తే వారి సమస్యలపైనా తాను ఉద్యమిస్తానని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, శ్రీ వైదిక పీఠం, వైదిక బ్రాహ్మణ సంఘం, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల సంయుక్తాధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మన దేశంలో కొన్ని వేల ఏండ్ల నుంచి కుల వ్యవస్థ ఉందని, కులమతాలకతీతంగా భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తేనే సమానత్వం వస్తుందని తెలిపారు. సమానత్వం లేకపోవడం వల్లే.. అగ్రవర్ణాలు బలపడి, వెనుకబడిన వర్గాలు బలహీనపడ్డాయని స్పష్టంచేశారు. అన్నివర్గాల మద్దతు లభించడంతోనే 30 ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటం సాధ్యమైందని పేర్కొన్నారు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడతానని తెలిపారు. దళితుల్లోని 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయని ఉద్ఘాటించారు. సమావేశంలో శ్రీవిద్యశక్తి పీఠం ప్రతినిధి నారాయణ చక్రవర్తి శర్మ, వైదిక బ్రాహ్మణ సంఘం, ఆలిండియా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బాల సుబ్రహ్మణ్యం, నిరంజన్ దేశాయ్, సుదర్శన్, శైలజా, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీ, కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.