రవీంద్రభారతి, అక్టోబర్ 22: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాలు ఈ నెల 24న ధర్నాచౌక్‌లో తలపెట్టిన మహాధర్నా కోసం బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో సన్నాహక సమావేశంలో నేతలు మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, నేషనల్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదే శాశ్వత పరిష్కారం అని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టకపోతే కోర్టులు కొట్టివేస్తాయని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఎఎస్ అధికారి టీ చిరంజీవులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో అఖిపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లాలని సవాల్ విసిరారు. డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టాలని, ఇండి కూటమి ఎంపీలతో కలిసి కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతులో పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీకి కూడా బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధిలేదని స్పష్టమవుతుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే పదిరెట్లు పెద్దది అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్, సింగం నాగేశ్వర్‌గౌడ్, రాంనర్సింహాగౌడ్, దామోదర్‌గౌడ్, విజయభాస్కర్, బైరి శేఖర్, చామకూర రాజు, దుర్గయ్యగౌడ్, రాచాల యుగంధర్‌గౌడ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.