Congress | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పేరు చెప్తేనే రైతన్న కన్నెర్రజేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకొని వణికిపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ మూడు గంటల కరెంటు పాట పాడుతున్న కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే తమకు ప్రత్యక్ష నరకం తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అగ మ్య గోచర కాలమది.. రాత్రిళ్లు కరెంటు కోసం బాయికాడికి వెళ్లి పాములు కరిచి చనిపోయిన ఘటనలు కోకొల్లలు. రాత్రిపూట చేలల్లోనే గడిపిన ఆ కాళరాత్రుల కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని రైతన్నలు చెప్తున్నారు.
ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న అన్నదాతలు
పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధల నుంచి గట్టెక్కిన తెలంగాణ రైతాంగం.. సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తుతో రెండేసి పంటలను పండిస్తూ సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ హయాంలో పడ్డ కష్టాలను మెల్లమెల్లగా మర్చిపోతున్నారు. నాడు పంటలు చేతికి రాక.. చేసిన అప్పులు తీరక అన్నదాతలు పడ్డ అగచాట్లను తమ జ్ఞాపకాల్లోంచి తుడిచేస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ఉరికొయ్యల పాలు కావటం తప్ప మరో మార్గం ఉండదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మరోసారి మూడు గంటల కరెంటు అంటుంటే అల్లాడిపోతున్నారు. కరెంటు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోవటం, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్ల కాలిపోయి పడిన యాతనలు గుర్తుచేసుకొంటున్నారు. పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చలేక పొలాల్లోనే పురుగుల మందు తాగి, ఉరివేసుకుని చనిపోయిన అన్నదాతల కుటుంబాల ఆక్రందనలు ఇంకా రైతన్నల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నాడు 7 గంటలు పేరుచెప్పి 5 గంటలు కరెంటు ఇవ్వలేదని, ఇప్పుడు ఏకంగా మూడుగంటలే కరెంటు చాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నేతల కోతలు.. కరెంటు వాతలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు 19 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండేవి. వీటికింద సుమారు 50 లక్షల ఎకరాల భూమిని రైతన్నలు సాగుచేసేవారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో అప్పుడు వచ్చిన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 5,661 మెగావాట్లు మాత్రమే. అప్పట్లో ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు. అయినప్పటికీ.. డిమాండ్ మేరకు విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయేది. గరిష్ఠ డిమాండ్‌లో కొరత 2,700 మెగావాట్ల వరకు ఉండేది. దీంతో నిత్యం కరెంటు కోతలతో రైతులతోపాటు సామాన్య ప్రజలకు కూడా నరకం చూపించింది. అధికారికంగానే రోజూ దాదాపు 8 గంటలపాటు గృహ, వాణిజ్య వినియోగదారులకు కోతలు విధించారు. గ్రామాల్లో అయితే రోజూ 12 నుంచి 16 గంటలపాటు కోతలుండేవి. అలాగే మండల కేంద్రాల్లో 8 నుంచి 12 గంటలు, జిల్లా కేంద్రంల్లో 6 నుంచి 10 గంటలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ 4 నుంచి 6 గంటలపాటు విద్యుత్తు కోతలు ఉండేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే. వ్యవసాయానికి ఆరు గంటలపాటు అని చెప్పినా.. పగటి పూట 3 గంటలు.. రాత్రి పూట 3 గంటలు ఇచ్చేవారు. అది కూడా ఐదారు విడతలుగా సరఫరా చేసేవారు. దీంతో ఎక్కడ చూసినా కరెంటు పోరాటాలే కనిపించేవి. ధర్నాలు, నిరసనలు, దిగ్బంధనాలు, ముట్టడిలు, రాస్తారోకోలు నిత్యకృత్యం. అధికారుల నిర్బంధం, నాయకులు ఘెరావ్‌లతో పోలీసుల కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరిగిన రైతుల వేల మంది ఉన్నారు.
కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు
లో ఓల్టేజీ కరెంటుతో కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా పేలిపోయేవి. రైతుల మోటర్లయితే ప్రతి నెలా రిపేరుకు పోవాల్సిందే. నాడు గ్రామాల్లో విద్యుత్తు మోటర్లు రిపేర్ చేసే మెకానిక్కు ఉన్న డిమాండ్ వేరెవరికీ ఉండేది కాదు. మెకానిక్ షాపుల వద్ద రైతులు అర్థరాత్రి వరకు పడిగాపులు పడి పంపులను రిపేర్ చేయించుకొని వెళ్లేవారు. సమస్యలను పరిష్కరించేందుకు రైతులే విద్యుత్తు ఉద్యోగులై, కరెంటు షాకులతో తనువు చాలించిన ఘటనలు అనేకం.
అర్ధరాత్రి చేనుల్లో జీవితం
కాంగ్రెస్ హయాంలో మూడు గంటలు పగలు.. మూడు గంటలు రాత్రిళ్లు విద్యుత్తు సరఫరా చేయడంతో రైతుల జీవితం దాదాపుగా పొలాలు, చేనుల్లోనే గడిచేది. తండ్రి.. లేకపోతే కొడుకు.. అదీగాక పోతే భార్యో.. ఇంటి కోడలో.. ఎవరో ఒకరు బావి, బోరు మోటర్ వద్దే ఉండేవారు. కరెంటు కోసం అహోరాత్రులు రైతు కుటుంబం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసేది. కరెంటు రాగానే ఆటోమెటిక్ స్టార్టర్‌తో మోటర్ పనిచేయడం మొదలు పెట్టినా నీళ్లు మొదటి మడి తడిచేలోగా కరెంటు పోయేది. మళ్లీ కరెంటు వస్తే తడిచిన మడే తడిచి.. మిగతా పొలం ఎండిపోయేది. చాలా రైతు కుటుంబాల్లో అప్పుడే పళ్లైన యువకులు కూడా భార్యను వదిలి రాత్రిపూట బాయిలకాడ కరెంటు కోసం ఎదురుచూస్తూ గడిపేవారు.
ఇప్పుడు నిర్ణయం రైతన్నలదే..
కేవలం మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్ హయాంలో పదేండ్ల క్రితం వరకు కరెంటు ఎలా ఉండేదో అన్నదాతలకు తెలుసు. తెలంగాణ రైతాంగం అప్పటి కష్టాలను కావాలని కొనితెచ్చుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. సీఎం కేసీఆర్ పరిపాలనలో పండుగలా మారిందని సంతోషపడుతున్న సమయంలో.. మళ్లీ నాటి కష్టాలు కొనితెచ్చుకోవటం అవసరమా? 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తు స్థానంలో మూడు గంటలు.. అదీ ఆగుతూ ముక్కుతూ మూల్గుతూ, మోటర్లు కాలుతూ, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ వచ్చే కరెంటును రైతన్న ఎందుకు కోరుకొంటాడు? నాటి పరిస్థితే మళ్లీ వస్తే రైతుల పరిస్థితి బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి కావటం ఖాయం. వ్యవసాయాన్ని పండుగ చేసుకోవాలో.. దండుగ చేసుకోవాలో నిర్ణయం రైతన్నలదే.
ఏ గవర్నమెంటూ కేసీఆర్‌లా చూసుకోలే
నేను చిన్నప్పటి నుంచి యవుసం చేస్తున్నా. ఏ గవర్నమెంటు కేసీఆర్‌లా రైతులను చూసుకోలే. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇచ్చి బాగా చూసుకుంటున్నడు. రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని చెప్పడం రైటు కాదు. మూడు గంటల కరెంటు ఏమూలకు సరిపోదు. 24గంటల కరెంటు ఉండడం వల్లనే పంటలు పండి ఇన్ని పైసలు కండ్ల జూస్తున్నాము. 10 హెచ్‌పీ మోటరు ఇప్పుడు రైతులు ఎవ్వరూ పెట్టుకోవటం లేదు. అది పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు కావాలె. 10హెచ్‌పీ మోటరు ఎక్కువ నడిస్తే బోరుబావిలోనే కూలిపోతది. అప్పుడు రైతులకు ఇంకా కష్టం అవుతుంది. కేసీఆర్ సారు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు సరఫరా ఉంటేనే మంచిది.
–అనంతయ్య, రైతు, చింతలపల్లి గ్రామం (సంగారెడ్డి జిల్లా)
రైతులను నిండా ముంచాలని చూస్తుండ్రు
కాంగ్రెసోళ్లు రైతులను నిండా ముంచుదామని సూస్తుండ్రు. మూడు గంటల కరంట్ ఎటు సరిపోదు. కనీసం మడి కిందికి కూడా నీళ్లు పారవు. ఎట్ల పండిస్తం పంటలు. వారన్న మాటలు పచ్చి అబద్ధ్దాలు.వాళ్ల మాటలను నమ్ముకుంటే ఇక రైతులు మునుగుడే. 10హెచ్‌పీ మోటర్లను బిగించుకోవాలని చెప్తుండ్రు.ఇది జరగని పని. పది హెచ్‌పీ మోటర్ బిగిస్తే బోరుబావిలో ఉన్న నీళ్లు కూడా ఉండయి. మూడు గంటలు కాదుగదా 30 నిమిషాలు గూడా బోరుబావిలో నుంచి నీళ్లు రావు. 10 హెచ్పీతో మాకు లాభాలు కాదుకదా మా కష్టం మొత్తం మోటర్ల రిపేర్లకే సరిపోతది.
-జలగడుగుల గంగారాం, రైతు, రామాయంపేట్ (మెదక్ జిల్లా)
3 గంటల కరెంటుతో పారిన దొయ్యే పారుతుంది
మూడుగంటల కరెంటుతో పారిన దొయ్యే పారుతుంది. రైతులందరూ 5 హెచ్‌పీ మోటర్లే వాడుతున్నారు. ఒకరో, ఇద్దరో 7.5 హెచ్‌పీ మోటర్ ఉపయోగిస్తున్నారు. మూడు గంటల కరెంటుకు 10 మోటర్ పెట్టుకున్నా దండగే. అందరూ ఒకేసారి మోటర్లు వేస్తే ట్రాన్స్ఫార్మపై లోడ్ ఎక్కువై పేలిపోతాయి. ఇప్పుడు ఉన్న కరెంట్ ఫస్ట్‌క్లాస్‌గా ఉంది. లో వోల్టేజీ సమస్య లేదు. నేను 1994 నుంచి మోటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాను. నా అనుభవ పూర్వకంగా చెప్తున్నా. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లతో ఏమాత్రం ఉపయోగం లేదు.
– కత్తి నర్సింహ బోర్ మోటర్ మెకానిక్ లాల్గడీమలక్పేట, మేడ్చల్ జిల్లా