Devadula Project | హనుమకొండ సబర్బన్, మార్చి 30 : జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశ మోటర్ నీటి సరఫరా మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. ధర్మసాగర్ రిజర్వాయర్‌లోని నీటి డెలివరీ సిస్టర్న్ కంటే 200 మీటర్ల ముందు నుంచి నిర్మించిన టన్నెల్‌కు భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో దేవన్నపేట పంప్‌హౌస్ నుంచి వస్తున్న నీరు టన్నెల్‌కు ఏర్పడిన పగుళ్ల నుంచి భారీ ఎత్తున ఉబికివచ్చాయి. వేగంగా వచ్చిన నీరు పక్కన పంట పొలాల్లోకి వెళ్లడంతో కొంత మేరకు ధ్వంసమయ్యాయి.
ఆదివారం ఉదయం జరిగిన ఈ నీటి లీకేజీని గుర్తించిన రైతులు స్థానిక రిజర్వాయర్ సిబ్బందికి చెప్పడంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే మోటర్‌ను అధికారులు నిలిపివేశారు. ఘటనా స్థలిని ఇంజినీర్లు పరిశీలించారు. ప్రమాద తీవ్రత భారీగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే మరమ్మతులపై మాత్రం అధికారులు మౌనం వహిస్తున్నారు. ఎన్ని రోజుల్లో పునరుద్ధరించి పంపింగ్ ఎప్పుడు ప్రారంభిస్తామనేది మాత్రం చెప్పలేకపోతున్నారు.
అయితే మరమ్మతు పనులను కాంట్రాక్టు ఏజెన్సీ చూసుకుంటుందని మాత్రం చెప్తున్నారు. ఇదిలావుండగా టన్నెల్ నిర్మాణంలో ఉన్న లోపాలే ప్రస్తుత ప్రమాదానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రమాదం వల్ల చివరి దశలో ఉన్న పంటల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చినట్టయిందని రైతులు వాపోతున్నారు.
ధర్మసాగర్ రిజర్వాయర్ దిగువన 60 ఎంఎల్డీ, 25 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (కెపాసిటీ గల డబ్ల్యూటీపీ) భారీ మూడు ప్లాంట్లను మిషన్ భగీరథ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్లాంట్ల ద్వారా వరంగల్ నగరపాలక సంస్థతోపాటు 270 గ్రామాల దాహార్తి తీరుతుంది. ఆదివారం నాటి దేవాదుల టన్నెల్ నుంచి నీరు లీకైన ఘటనలో ప్రమాద తీవ్రతకు మిషన్ భగీరథ షీట్ ట్రాక్‌పై వేసిన దిమ్మెలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొంత సేపు మోటర్ నడిస్తే పైప్‌లైన్ ధ్వంసమయ్యేదని అధికారులు అంటున్నారు.