ఖైరతాబాద్, ఏప్రిల్ 16 : రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలను సీఎం రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్నారని మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. నక్క జిత్తులోల్లు, నల్లికుట్లోల్లు తన వెనుక గోతులు తవ్వుతున్నారని ఇటీవల ఓ సభలో సీఎం చెప్పారని, దీనిబట్టి త్వరలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కులగణన ప్రకారం రాష్ట్రంలో మాదిగలే మెజార్టీగా ఉన్నారు.
కానీ లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, కార్పొరేషన్లలో స్థానం మాత్రం లేదు. ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు. మల్లు రవిని ఎలా ఎంపిక చేశా రు. వెంకటస్వామి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి టికెట్లు ఇచ్చారు. వివేక్ సహా ముగ్గురు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారు. 80 శాతం ఉన్న మాదిగలను వదిలిపెట్టి 10 శాతం కూడా లేని మాలలకు టికెట్లు ఎలా ఇస్తారు. రేవంత్ రెడ్డి వివక్షాపూరితమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.