యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతన్నల సంక్షేమానికి పెద్దపీట వేసినందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు రైతు బీమా, ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని ప్రశంసించారు, రైతులకు రుణమాఫీ చేయడం చాలా సంతోషమని, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణాలు కట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో రైతులు మూడు పంటలు పండించుకుని సంతోషంగా ఉంటున్నారని పేర్కొన్నారు. జనరంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.