ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16 : గిరిజనులపై రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపు చేస్తున్నదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ మండిపడ్డారు. లగచర్లలో నిర్మించ తలపెట్టిన ఫార్మా కంపెనీ ఏర్పాటును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో గిరిజనులను జైళ్లో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మోతీలాల్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయమని అన్నారు. పోలీసులు గిరిజన వృద్ధురాలిపై దాడి చేస్తే మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎటుపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. లగచర్లలో పేదల భూములు లాక్కోవడాన్ని ఉపసంహరించుకోవాలని, లంబాడాలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.